ఈ దుందుడుకు వ్యాఖ్యలు ప్రాంతీయ శాంతి, సుస్థిరతకు ముప్పు: పాకిస్థాన్

రాజ్‌నాథ్‌ వ్యాఖ్యలపై పాక్

Pakistan criticises Defence Minister Rajnath

న్యూఢిల్లీః 24వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ భారతదేశ గౌరవం, ప్రతిష్టలను కాపాడుకోవడం కోసం నియంత్రణ రేఖ దాటేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపిన విషయం తెలిసిందే. అయితే రాజ్‌నాథ్‌ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. ఈ దుందుడుకు వ్యాఖ్యలు ప్రాంతీయ శాంతి, సుస్థిరతకు ముప్పు అని పేర్కొంది.

రాజ్‌నాథ్‌ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘అలాంటి దుందుడుకు వ్యాఖ్యలు ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు ముప్పు. దక్షిణాసియాలో వ్యూహాత్మక వాతావరణాన్ని అస్థిరపరుస్తాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని భారత్ కు మేము సలహా ఇస్తున్నాము’ అని తెలిపింది.

24వ కార్గిల్ దివస్ సందర్భంగా రాజ్‌నాథ్‌ బుధవారం ద్రాస్ లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించి.. అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాక్ కు పరోక్ష హెచ్చరిక చేశారు. పాకిస్థాన్ వెన్నుపోటు పొడవడంతోనే కార్గిల్ యుద్ధం తలెత్తిందన్నారు. మళ్లీ అలాంటి ఘటనలు రిపీట్ అయితే భారత్ తన ప్రయోజనాలు కాపాడుకునేందుకు నియంత్రణ రేఖ దాటేందుకూ సిద్ధంగా ఉందని అన్నారు. మాకు అన్నింటికంటే దేశ గౌర‌వం, ప్ర‌తిష్ట అధిక‌మ‌ని, దేశ గౌర‌వాన్ని ప్రాదేశిక స‌మ‌గ్ర‌త‌ను కాపాడేందుకు ఎంత‌వ‌రకైనా వెళ‌తామ‌ని రాజ్‌నాథ్‌ సింగ్ స్ప‌ష్టం చేశారు.