జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా..కారణం ఆ బిఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేదింపులు భరించలేక జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..మూడేళ్ల పదవీకాలంలో తనను తీవ్ర ఇబ్బందుల పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని శ్రావణి ఆరోపించారు. భద్రత కల్పించాలని మున్సిపల్ ఛైర్పర్సన్ ఎస్పీని కోరారు. నా కుటుంబాన్ని సంజయ్ కుమార్ బెదిరించారని ఆమె ఆరోపించారు. మూడేళ్లుగా నరకం అనుభవించాను.. ఇప్పడు బయటపడ్డానన్నారు. తనపై ఆరోపణలు అబద్ధం అయితే.. కాదని ఎమ్మెల్యే తన మనవరాలి మీద ప్రమాణం చేయాలన్నారు.

బీసీ మహిళ ఎదగడం చూసి ఓర్వలేక ప్రతి తప్పుకు తనని బాధ్యుల్ని చేశారని శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్లను సైతం ఎమ్మెల్యే సంజయ్ టార్చర్ చేశాడని ఆమె ఆరోపించారు. తనకు చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టొద్దని ఎమ్మెల్యే హుకుం జారీ చేశాడని, తన పదవితో పోలిస్తే మున్సిపల్ చైర్మన్ పదవి చాలా చిన్నది అంటూ చాలాసార్లు సంజయ్ అవమానించాడని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నా అభివృద్ధే లక్ష్యంగా తాను ముందుకు వెళ్ళానని శ్రావణి చెప్పారు.

పేరుకే తాను మున్సిపల్ చైర్మన్ నని పెత్తనమంతా ఎమ్మెల్యేనే చలాయించేవాడని శ్రావణి ఆరోపించారు. పార్టీ కోసం పనిచేస్తున్నా కక్షగట్టి ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. ఎమ్మెల్సీ కవితను కలవకూడదని, కేటీఆర్ పేరు ప్రస్తావించకూడదని సంజయ్ కుమార్ హెచ్చరించారని శ్రావణి అన్నారు. ఎమ్మెల్యే నుంచి తమకు ఆపద ఉందన్న శ్రావణి తన కుటుంబానికి ఏమైనా జరిగితే అందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారణమని తెలిపారు.