సీఎం జ‌గ‌న్ తో భేటీ కానున్న మంత్రి గోవ‌ర్థ‌న్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌

మధ్యాహ్నం 3 గంటలకు జగన్ కార్యాలయానికి రానున్న నేతలు

అమరావతి: నెల్లూరు జిల్లాలో కొత్త మంత్రి కాకాణి గోవర్ధర్ రెడ్డికి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మధ్య విభేదాలు తీవ్రతరమైన సంగతి తెలిసిందే. మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో సభ నిర్వహిస్తున్న సమయంలోనే… దానికి పోటీగా అనిల్ మరో సభను నిర్వహించారు.

అంతేకాదు, ఫ్లెక్సీలకు సంబంధించి కూడా రచ్చ జరిగింది. కాకాణి గురించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేశారు. పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవుతుండటంతో ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. వచ్చి తనను కలవాలంటూ కాకాణి, అనిల్ కు ఆదేశాలు జారీ చేశారు.

జగన్ ఆదేశాలతో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కాకాణి, అనిల్ కు ఫోన్ వచ్చింది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఇరువురు నేతలు క్యాంపు కార్యాలయానికి రానున్నారు. వీరిద్దరికీ జగన్ క్లాస్ పీకనున్నారు. విభేదాలను పక్కన పెట్టి కలసికట్టుగా పని చేయాలని ఇద్దరికీ సీరియస్ వార్నింగ్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/