రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీలు పెరిగిన మాట వాస్తవమేః మంత్రి ధర్మాన

Minister Dharmana

అమరావతిః రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీలు పెరిగిన మాట వాస్తవమేనని ఏపీ రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. దేశంలో ప్రతి రాష్ట్రంలో పెరిగాయని, ధరల పెరుగుదల అనేది కేంద్రం చేతిలో ఉంటుందని తెలిపారు. ప్రజలకు లబ్ధి చేకూరేలా పథకాలు, ఇళ్లు ఇస్తుంటే ప్రతిపక్షాలు రోడ్లు బాగా లేవని గుంతలు చూపిస్తున్నాయని మండిపడ్డారు. ఏడాది సమయం ఇస్తే రోడ్లు వేస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

“స్థూల జాతీయోత్పత్తిలో రాష్ట్రం నాలుగేళ్లలో ప్రగతి సాధించింది. గతంలో 14 ఏళ్ల పాటు చంద్రబాబు పాలనలో ప్రగతి కనిపించలేదు. రాష్ట్రంలో పేదలందరికీ విద్య, వైద్యం, సంక్షేమం అందించాం, గతంలో జన్మభూమి కమిటీల పేరుతో టిడిపి.. పేదలకు పథకాలు అందకుండా చేసింది. గత ప్రభుత్వం వంశధార నిర్వాసితులకు అన్యాయం చేసి, అడ్డగోలుగా నిర్వాసితులను ఖాళీ చేయించింది.” అని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. ఈ సభలో మంత్రి ధర్మానతో పాటు సభాపతి తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొన్నారు.