కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం – గుజ‌రాత్ మాజీ సీఎం శంక‌ర్ సింఘ్ వాఘేలా

వర్తమాన జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమున్నదని గుజ‌రాత్ మాజీ సీఎం శంక‌ర్ సింఘ్ వాఘేలా అన్నారు. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్దమవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అందుకోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలను ఏకతాటి మీదికి తీసుకురావటంతో పాటు తాను పెట్టబోయే కొత్త జాతీయ పార్టీ కి మద్దతు కూడగట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. తనతో నడిచే పలు పార్టీల నాయకులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ సీఎం లతో భేటీ అయినా కేసీఆర్..ఈరోజు గుజ‌రాత్ మాజీ సీఎం శంక‌ర్ సింగ్ వాఘేలాతో స‌మావేశ‌మ‌య్యారు. శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్​తో గుజరాత్​ మాజీ సీఎం భేటీ అయ్యారు. సుమారు ఐదు గంటల పాటు సాగిన సమావేశంలో పలు జాతీయ స్థాయి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

భేటీ అనంతరం శంక‌ర్ సింఘ్ వాఘేలా మాట్లాడుతూ ..వర్తమాన జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమున్నదని, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం ద్వారా ప్రస్థుతం కొనసాగుతున్న బీజేపీ దుర్మార్గ రాజకీయాలను తిప్పికొట్టాలని, అందుకు దేశంలోని తమలాంటి అనేక మంది సీనియర్ రాజకీయ నాయకుల సంపూర్ణమద్దతుంటుందని శంకర్ సింగ్ వాఘేలా అన్నారు. సీఎం కేసీఆర్​ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు.

దేశానికి ఆదర్శంగా అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి తోపాటు దేశంలో నెలకొన్న వర్తమాన రాజకీయ పరిస్థితులు జాతీయ అంశాల పై చర్చసాగింది. చర్చలో ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపరీత పోకడలతో అనుసరిస్తున్న స్వార్థ రాజకీయ క్రీడ దేశ ప్రజలపై, దాని పర్యవసానాలపై ఇరువురు నేతలు దృష్టి సారించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, జాతి అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాల్లో కొనసాగుతున్న తమ వంటి సీనియర్ జాతీయ నేతలంతా నేటి బీజేపీ రాజకీయాల పట్ల ఆందోళనతో ఉన్నారని వాఘేలా అన్నారు.