చంద్రబాబు కంటే నల్లత్రాచు బెటర్ – మంత్రి అంబటి

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ వైసీపీ – టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇరు అధినేతలు ప్రజల్లోకి వెళ్తూ ఒకరిపై ఒకరు విమర్శలు , ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ‘చంద్రబాబు నన్ను ఆంబోతు రాంబాబు అన్నారు. అధికారంలోకి వస్తే నాకు ముక్కుతాడు వేస్తాడట. అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే చరిత్ర చంద్రబాబుది. మేము మళ్లీ గెలవగానే “ఆంబోతులకు ఆవులను సప్లై చేసే రాజకీయ నాయకుడు” అని చంద్రబాబు చేతిపై పచ్చబొట్టు వేయిస్తా. చంద్రబాబు కంటే నల్లత్రాచు బెటర్’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సీఎం జగన్‌ నిర్వహించిన ‘ సిద్ధం’ కార్యక్రమంపై జనసేన నాయకులు తామూ సిద్ధమేనంటూ వేసిన పోస్టర్లపై అంబటి రాంబాబు స్పందించారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామంటూ జగన్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఏపీలో పొత్తుల ఖరారును, పోటీ చేసే స్థానాలను , సీఎంగా ఎవరుంటారనే అంశాన్ని తేల్చకుండా చంద్రబాబు , పవన్‌కల్యాణ్‌ అయోమయ స్థితిలో ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబును బుజాన వేసుకొని తిరుగడానికి సిద్ధంగా ఉన్నారా? ప్యాకేజీ ఇస్తే ఎత్తుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ పవన్‌పై సెటైర్లు వేశారు.