వెంకట్‌రెడ్డి బీజేపీతో టచ్‌లో ఉన్నారని తాను అనలేదని చెప్పుకొచ్చిన బండి సంజయ్

Bandi Sanjay Clarity on Komatireddy venkat reddy Issue

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తమతో టచ్​లో ఉన్నారని తాను అనలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ స్పష్టం చేశారు. ఇక నిధుల విషయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధాని మోడీని కలుస్తుంటారని చెప్పుకొచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.

మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర భువనగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా నియోజకవర్గంలోని భట్టుపల్లి గ్రామానికి చేరుకున్న బండి సంజయ్‌కి గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం భట్టుగూడెం వద్ద మూసీ నది లోలెవల్ బ్రిడ్జి, పక్కనే ఉన్న పంట పొలాలను బండి పరిశీలించారు. పలువురు గ్రామస్థులు తమ సమస్యలను బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. భాజపా ప్రభుత్వం వచ్చాక అందరి సమస్యలను పరిష్కరిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ ఈ నెల 21 న కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో బిజెపి లో చేరబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. మునుగోడు ప్రజలు తనవెంట ఉన్నారని స్పష్టం చేశారు. అలాగే మరికొంతమంది కాంగ్రెస్ నేతలు సైతం కాంగ్రెస్ ను వీడబోతున్నట్లు తెలిపారు.