ప్రభుత్వ ఉద్యోగుల‌ లంచ్ బ్రేక్ స‌మ‌యాన్ని తగ్గించిన సీఎం యోగి ఆదిత్య నాథ్

ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి యోగి ఆదిత్య నాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్ర‌భుత్వం కార్యాల‌యాల్లో ఉద్యోగుల‌కు లంచ్ బ్రేక్ స‌మ‌యాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్ప‌టి వ‌ర‌కు అంచ్ బ్రేక్ స‌మ‌యం ఒక గంట ఉండగా.. దాన్ని తాజాగా అర‌గంట‌కు కుదించారు. దీని వల్ల ప్ర‌భుత్వ ఉద్యోగులు.. ప్ర‌జ‌ల‌కు సాయం చేసే స‌మ‌యం ఇంకా పెరుగుతుంద‌ని తెలిపారు. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీర్చేందుకు ప్ర‌భుత్వాలు ఉన్నాయ‌ని అన్నారు. అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు. కొవిడ్​ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన టీమ్​ 9 అధికారులతో సీఎం ఆదిత్యనాధ్​ సమావేశమయ్యారు.

పారదర్శకత దృష్ట్యా వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులకు డీపీఆర్​ సిద్ధం చేసిన సంస్థలను టెండర్​ ప్రక్రియలో పాల్గొనకుండా చూడాలని సూచించారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా ట్యాబ్లెట్లు, స్మార్ట్​ఫోన్లు అందజేస్తుందని ఈ సందర్బంగా తెలిపారు. బుందేల్​ఖండ్​ ఎక్స్​ప్రెస్​వే రూపంలో రాష్ట్రానికి కొత్త బహుమతి రాబోతుందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​ సందర్భంగా ఏప్రిల్​ 18 నుంచి 23 వరకు ప్రత్యేక ఆరోగ్య మేళాలు నిర్వహించాలన్నారు. అలాగే రాష్ట్రంలో 75 చెరువుల పూడిక‌ల‌ను కూడా తీస్తామ‌ని ప్ర‌క‌టించారు.