హిందువులకు ఆజన్మాంతం గుర్తుండేలా యాదాద్రి ఆలయాన్ని నిర్మించారని స్వరూపానందేంద్ర స్వామి ప్రశంసలు ..

హిందువులకు ఆజన్మాంతం గుర్తుండేలా యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. ఈ కాలంలో ఇంతటి మహాద్భుత ఆలయాన్ని నిర్మించడం హిందూ మతానికే గర్వకారణమన్నారు. ఆలయం ఇప్పుడిప్పుడే ప్రారంభం కావడంతో చిన్నచిన్న లోటుపాట్లు ఉండటం సహజమేనని, త్వరలోనే అన్ని సమస్యలు తీరిపోతాయన్నారు.

మంగళవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి దర్శించుకున్నారు. గ‌ర్భ‌గుడిలోకి స్వామి వారికి స్వ‌రూపానందేంద్ర స్వామి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. ఆ త‌ర్వాత ప్ర‌ధానాల‌య నిర్మాణాల‌ను ప‌రిశీలించారు. స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తి స్వామికి ఆల‌య అర్చ‌కులు, ఈవో గీత పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. ఆల‌య ఉద్ఘాట‌న త‌ర్వాత ద‌ర్శించుకున్న మొట్ట‌మొద‌టి పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి వారే కావడం విశేషం.

యాదాద్రిలో స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. తిరుమల‌ తిరుపతి దేవాలయం స్థాయిలో యాదాద్రి కూడా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఏకాదశి నాడు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకోవాలని 10రోజుల క్రితం ఆకాంక్ష కలిగిందని తెలిపారు. దేశంలో ఎంతోమంది హిందువులం అని చెప్పుకుంటున్నా.. ఎవరూ చేయని విధంగా కేసీఆర్ అద్భుత రీతిలో ఆలయాన్ని నిర్మించారని కొనియాడారు.