ఎస్పీ ఇసుకను తరలిస్తున్న వాహనాలను ఎందుకు సీజ్ చేయడం లేదు?: జేసీ ప్రభాకర్ రెడ్డి

చంద్రబాబును సీఎం చేయడం కోసం ఎవరి కాళ్లైనా పట్టుకుంటానని వ్యాఖ్య

jc-prabhakar-reddy

అమరావతిః తాడిపత్రి మున్సిపాలిటీని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దోచుకుంటున్నారని టిడిపి నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మార్కెట్లో షాపులను కేతిరెడ్డి మనుషులకు ఇచ్చారని చెప్పారు. టిడిపి నుంచి గెలిచిన కౌన్సిలర్ రాబర్ట్ ను వైఎస్‌ఆర్‌సిపిలో చేర్చుకున్నారని… ఆయనకు మున్సిపల్ స్థలాన్ని కట్టబెట్టి, బిర్యానీ సెంటర్ పెట్టిస్తున్నారని మండిపడ్డారు. మున్సిపాలిటీ స్థలాన్ని పోలీస్ స్టేషన్ కోసం తీసుకున్నారని… అక్కడ పోలీస్ స్టేషన్ ను నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని చెప్పారు.

వైఎస్‌ఆర్‌సిపి చెప్పినట్టే జిల్లా ఎస్పీ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎస్పీ గారూ.. నా మాటలు మిమ్మల్ని బాధపెట్టొచ్చు… అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను ఎవరికి భయపడి సీజ్ చేయడం లేదని ప్రశ్నించారు. తాడిపత్రి కోసం ప్రాణమిస్తానని చెప్పారు. తాడిపత్రి బాగు కోసం రూ. 100 కోట్లు ఇస్తే మున్సిపల్ ఛైర్మన్ గా తాను రాజీనామా చేస్తానని తెలిపారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసం ఎవరి కాళ్లైనా పట్టుకుంటామని అన్నారు. ఎమ్మెల్యేలు ఎవరైనా పర్లేదని… చంద్రబాబు సీఎం అయితే చాలని చెప్పారు.