రవాణా వ్యవస్థపై మిగ్‌జాం భారీ ఎఫెక్ట్‌

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిచౌంగ్ తీవ్ర తుఫాన్ ఎఫెక్ట్ రవాణా వ్యవస్థపై భారీగా పడింది. వినమానయానం తో పాటు రైల్వే ఫై కూడా తూఫాన్ ప్రభావం పడింది. ఇప్పటికే పలు విమానాశ్రయాలు నీటితో నిండిపోవడం తో వైజాగ్‌ నుంచి వెళ్లే పలు విమానాలను అధికారులు రద్దు చేశారు. రైల్వే వ్యవస్థపై కూడా మిగ్‌జాం ఎఫెక్ట్ పడింది. దీని కారణంగా సుమారు 150 రైళ్లు అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. కాచిగూడ- చెంగల్పట్టు, హైదరాబాద్‌- తాంబరం, సికింద్రాబాద్‌- కొల్లాం, సికింద్రాబాద్‌-తిరుపతి, లింగంపల్లి- తిరుపతి, సికింద్రాబాద్- రేపల్లె, కాచిగూడ-రేపల్లె, చెన్నై- హైదరాబాద్‌, సికింద్రాబాద్‌- గూడూరు, సికింద్రాబాద్‌-త్రివేండ్రం స్టేషన్ల మధ్య నడిచే రైళ్లు పూర్తిగా రద్దు చేశారు. మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు తెలిపారు. అత్యవసరమైన ప్రయాణాలు ఉంటే తప్ప మిగతా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇక తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మిచౌంగ్‌ తుఫాన్ ప్రభావంతో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం చెన్నైకి 170 కి.మీ, నెల్లూరుకు 20 కి.మీ, బాపట్లకు 150 కి.మీ, మచిలీపట్నానికి 210కి.మీ. దూరంలో ఉన్న తుఫాన్ మధ్యాహ్ననికి నెల్లూరు – మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ ఈశాన్య జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు ఇప్పటికే రెడ్‌, ఆరెంజ్‌ ఎల్లో అలర్ట్‌లు జారీ అయ్యాయి.