కాంగ్రెస్ కు తలనొప్పి తీసుకొస్తున్న సెకండ్ లిస్ట్

ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవడం గ్యారెంటీ అని అంత అనుకుంటున్నా సమయంలో ఇప్పుడు సెకండ్ లిస్ట్ తలనొప్పిగా మారింది. శుక్రవారం 45 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. అయితే ఈ లిస్ట్ తమ పేర్లు రాకపోవడం తో టికెట్ ఆశించిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది గాంధీ భవన్ ఫై రాళ్ల దాడి చేయగా..మరికొంతమంది రోడ్ల పైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది పార్టీ కి రాజీనామా చేయడం , రెబెల్ గా పోటీ చేస్తామని ప్రకటించడం..ఇప్పుడు కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది.

మైనారిటీ శాఖ ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్లా సోహెల్‌ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే కూకట్‌పల్లి టికెట్‌ దక్కకపోవటంతో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా చేశారు. ఎల్లారెడ్డిలో రెబెల్ అభ్యర్థిగా రంగంలో ఉంటానని ప్రకటించారు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో సుభాష్‌రెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. వడ్డేపల్లికి టికెట్‌ దక్కలేదని ఆయన అనుచరుడు, నాగిరెడ్డిపేట మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాకేష్‌ నిరాశకు గురయ్యాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్టీ కార్యకర్తలు అతన్ని అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. అలాగే జూబ్లీహిల్స్‌ టికెట్‌ దక్కకపోవడంతో విష్ణువర్థన్ రెడ్డి అనుచరులు గాంధీభవన్‌లో హల్ చల్ చేశారు.

ఎల్లారెడ్డిలో రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తా అని సుభాష్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌ పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాదు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌ను గెలవనివ్వనని సవాల్ చేశారు. కామారెడ్డిలోని 4 నియోజకవర్గాల్లో తాను పోటీగా అభ్యర్థులను నిలబెడతా అన్నారు. ఇలా చాలామంది టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కాంగ్రెస్ కు రెబెల్ గా మారుతున్నారు.