గుంటూరు జిన్నా టవర్ ను పరిరక్షించుకుందాం

నరసరావుపేట ఎంపీ  లావు శ్రీకృష్ణదేవరాయలు

Let's protect Guntur Jinnah Tower: MP Srikrishna Devarayalu
Narasaraopet MP Srikrishna Devarayalu addressing the meeting

Guntur : గుంటూరు నగరంలోని జిన్నా టవర్ సెంటర్ ను మతోన్మాదుల నుండి కాపాడుకోవడం పౌరసమాజ కర్తవ్యం అని నరసరావుపేట ఎంపీ  లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. బుధవారం గుంటూరులోని మద్య విమోచన ప్రచార కమిటీ కార్యాలయ హాలులో జరిగిన’ ప్రాచీన కట్టడాలను కాపాడుకుందాం’ అనే చర్చా-గోష్టి కి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీకృష్ణదేవరాయలు ప్రసంగిస్తూ ఇండోనేషియా,మలేషియా,జపాన్ లాంటి దేశాలలో హిందూ దేవాలయాలు హిందూ సంస్కృతిని కొనసాగిస్తున్నాయని తెలిపారు. ముస్లింలు అధికంగా ఉన్న ఇండోనేషియాలో సైతం హిందూ దేవాలయాలను కాపాడడం గొప్ప పరిణామమన్నారు.భారతీయ జనతా పార్టీ తాలిబన్లను  ఆదర్శంగా తీసుకోరాదని తాలిబన్లు బౌద్ధమత విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో మత విద్వేషం తో ప్రాచీన కట్టడాలను ధ్వంసం చేయడం భారతీయ ధర్మానికి విరుద్ధమన్నారు.

మహమ్మద్ అలీ జిన్నా ప్రముఖ న్యాయవాది,స్వాతంత్ర ఉద్యమ నేత అని వారి కృషిని గుర్తించిన గుంటూరు ప్రజలు వారి పేరుతో స్వాతంత్య్రానికి పూర్వమే జిన్నా టవర్ ను నిర్మించారని గుర్తుచేశారు.భారతదేశ లౌకిక భావజాలాన్ని కాపాడవలసిన  బాధ్యత మన అందరిపై ఉందన్నారు.స్వాతంత్ర ఉద్యమ నేతల స్ఫూర్తిని స్మరించుకుంటూ ప్రాచీన కట్టడాలను కాపాడుకోవాలని కోరారు. శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికార సాధనకు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఇది లౌకిక భావజాలానికి వ్యతిరేకమన్నారు.

.శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు ప్రసంగిస్తూ ఉత్తర భారతదేశంలో మత కల్లోలాలను, భావోద్వేగాలను రెచ్చగొట్టి గుజరాత్,యూపీ లాంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగలిగిందన్నారు. ప్రజాస్వామ్య వాదులందరూ ఐక్యంగా ఉండి మతోన్మాదాన్ని నిరసించి లౌకిక వాదాన్ని బలపరచాలని కోరారు.సభకు అధ్యక్షత వహించిన జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ లో అభ్యుదయ భావజాలం ఉన్న అందరినీ ఐక్యపరచి బలమైన పౌరసమాజాన్ని నిర్మిస్తామని తెలిపారు.విభిన్న భాషలు, సంస్కృతి,ఆచారాలు,మతాలు, కులాలు ఉన్న భారత సమాజంలో ప్రజలందరినీ ఐక్యంగా ఉంచడానికి పౌర సమాజం కృషి చేయాలని కోరారు.జిన్నా టవర్ పేరును మార్చాలని,కూల్చాలని చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని బిజెపిని కోరారు.మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ , ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ మోదుగుల రవికృష్ణ , దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్,కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి,రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ సిహెచ్ చక్రపాణి,జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం మాలిక్,రిటైర్డ్ ప్రిన్సిపాల్ దేవరపల్లి పేరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/