ములుగులో దారుణం : మాజీ సర్పంచ్ ను హత్య చేసిన మావోలు

ములుగు జిల్లాలో మావోలు దారుణానికి ఒడిగట్టారు. రెండు రోజుల క్రితం మాజీ సర్పంచ్ ను కిడ్నప్ చేసిన మావోలు..అతడ్ని చంపినట్లు లేఖ విడుదల చేసారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలానికి చెందిన కుర్సం రమేష్ ను మావోయిస్ట్ లు కిడ్నాప్ చేసి హత్య చేసారు. మావోయిస్టుల‌ను మోసం చేసేలా వ్య‌వ‌హ‌రించాడ‌ని.. అందుకే ర‌మేష్ ను చంపిన‌ట్లు మావోయిస్టులు లేఖ ద్వారా తెలిపారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు మ‌ళ్లీ జ‌రిగితే.. వారిని కూడా శిక్షిస్తామ‌ని హెచ్చ‌రించారు.

2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున రమేష్ సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన వృత్తిరీత్యా డ్రైవర్. ఆయన భార్య రజిత ఏటూరునాగారం ఆస్పత్రిలో ఏఎన్‌ఎంగా పనిచేస్తోంది. దీంతో కుటుంబంతో కలసి ఏటూరు నాగారంలో నివాసముంటున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్‌గా పనిచేసే రమేష్‌కి మావోయిస్టులతో పరిచయం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కిడ్నాప్ చేశారని తెలిసినప్పటి నుంచి భార్య రజిత, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసారు, తన భర్త ను ఏమిచేయకూడదని వారు మొరపెట్టుకున్నా..మావోలు మాత్రం అతడిని చంపేశారు. ర‌మేష్ మృతి తో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.