టి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మాణిక్‌రావు ఠాక్రే

టీకాంగ్రెస్‌ బాధ్యతల నుంచి మాణిక్కం ఠాగూర్‌ తప్పుకోవడంతో ఆ ప్లేస్ లో మాణిక్‌రావు ఠాక్రే ను నియమించింది అధిష్టానం. అలాగే మాణిక్కం ఠాగూర్‌ ను గోవా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించింది. గత కొద్దీ నెలలుగా టి కాంగ్రెస్ లో సీనియర్లకు రేవంత్ కు మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య నేరుగా మీడియా ముందుకు వచ్చి సీనియర్ నేతలు రేవంత్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే మాణిక్కం ఠాగూర్‌ ఫై కూడా నిప్పులు చెరిగారు. మాణిక్కం ఠాగూర్‌ రేవంత్ వర్గానికే సపోర్ట్ గా ఉంటున్నారని , సీనియర్ల మాటలను పట్టించుకోవడం లేదని , మా బాధలను అధిష్టానానికి తెలియ జేయడం లేదని వారంతా వాపోయారు.

ఈ క్రమంలో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌కు వచ్చి… కాంగ్రెస్ ముఖ్య నేతలతో విడి విడిగా సమావేశమయ్యారు. ఎవరూ గొడవ పడకూడదని.. ఏవైనా సమస్యలు ఉంటే.. కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. అనంతరం ఇక్కడి పరిస్థితులపై హైకమాండ్‌కు నివేదిక అందించారు. ఇక ఇప్పుడు ఎవరు బయటకు ఏమి మాట్లాడకపోయినా లోలోపల మాత్రం కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఈ తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి మాణిక్కం ఠాగూర్ తప్పుకున్నారు. ఈరోజు అవగాహన సదస్సు జరిగిన అనంతరం.. ఆయన టి.కాంగ్రెస్ వాట్సప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. అందరికీ ధన్యవాదాలు అంటూ ఆఖరి మెసేజ్ పెట్టిన ఠాగూర్.. ఆ తరువాత అన్ని గ్రూప్‌లనుంచి లెఫ్ట్ అయ్యారు.

ఇక ఇప్పుడు మాణిక్కం ప్లేస్ లో మాణిక్‌రావు ఠాక్రే ను నియమించింది అధిష్టానం. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ అకస్మాత్తు నిర్ణయానికి గల కారణం తెలియకపోయినా మాణికంపై ఠాగూర్‌పై సీనియర్ నేతల్లో ఉన్న వ్యతిరేకతే ఇందుకు కారణమని చెబుతున్నారు. తెలంగాణలో జూనియర్, సీనియర్ నేతల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించలేకపోయారన్న అపప్రథను మాణికం ఠాగూర్ మూటకట్టుకున్నారు. అంతేకాదు, తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య భేదాభిప్రాయాలు పెరిగి సమస్య జటిలంగా మారడానికి కూడా ఆయనే కారణమన్న ఆరోపణలున్నాయి. అలాగే, ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ ఏకపక్షంగా ఉంటున్నాయని, టీపీసీసీకి అనుకూలంగా తీసుకుంటున్నారని సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మాణికం ఠాగూర్ టీపీసీసీ వాట్సాప్ గ్రూపు నుంచి తప్పుకోవడం, ఆ వెంటనే ఆయనను గోవా ఇన్‌చార్జ్‌గా నియమించడం త్వరగా జరిగిపోయాయి.

ఇదిలా ఉంటె టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు మీడియా తో మాట్లాడుతూ..టి కాంగ్రెస్ లో గొడవలు జరగడం కామన్ అని.. అయినా తామందరూ మళ్లీ కలిసిపోతామని స్పష్టం చేసారు. కాంగ్రెస్‭లో చేతులే కాదు తమ మనసులు కూడా కలవాలని రేవంత్ పిలుపునిచ్చారు. పార్టీ ఇంతకంటే మెరుగైన స్థాయికి వెళుతుందని అనుకుంటే.. ప్రస్తుతం తనకున్న పదవి కూడా వదులుకుంటానని అన్నారు. పీసీసీ వదులుకుంటే పార్టీ అధికారంలోకి వస్తుందంటే.. తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు.