డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన మంచు విష్ణు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA) అధ్యక్షుడు మంచు విష్ణు..తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన దగ్గరి నుండి సినీ ప్రముఖులు వరుసపెట్టి సీఎం రేవంత్ ను , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలుస్తూ అభినందనలు తెలియజేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ తదితరులు ఇప్పటికే వీరిని కలువగా..తాజాగా (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు తో పాటు మా ప్రధాన కార్యదర్శి రఘుబాబు, కోశాధికారి శివ బాలాజీ భట్టిని కలిసి శాలువాతో సత్కరించి, చిత్ర పరిశ్రమ తరపున బహుమతి అందజేశారు.
డిప్యూటీ సీఎంతో భేటీకి సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫొటోను పంచుకున్నారు మంచు విష్ణు. భట్టి విక్రమార్కను కలుసుకోవడం ఆనందంగా ఉంది. మేం పలు విషయాలపై చర్చించాం. తెలుగు చిత్ర పరిశ్రమ తరపున డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా మాట్లాడాం అని విష్ణు తెలిపారు. డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు మంచు విష్ణు. అందరం కలిసి డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.