ఐఏఎస్ రోహిణి సింధూరికి భారీ ఊరట

ఆరోపణలు ఆపాలంటూ రూప మౌద్గిల్ కు కోర్టు ఆర్డర్

Bengaluru Court Temporarily Restrains IPS Officer Roopa Moudgil, Media From Circulating Defamatory…

బెంగళూరుః కర్ణాటకలో సంచలనంగా మారిన ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ గొడవ కోర్టుకు చేరిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఐఏఎస్ ఆఫీసర్ రోహిణీ సింధూరికి ఊరట కలిగేలా బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రోహిణి పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పోస్టులు మానుకోవాలని ఐపీఎస్ రూపా మౌద్గిల్ ను కోర్టు ఆదేశించింది. అంతేకాదు, ఇప్పటికే చేసిన పలు వివాదాస్పద వ్యాఖ్యలు, ఆరోపణలపై వివరణ ఇవ్వాలని తన ఆదేశాలలో పేర్కొంది.

గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ గొడవ సంచలనంగా మారింది. ఇద్దరు ఉన్నతోద్యోగులు వ్యక్తిగత ఆరోపణలతో రచ్చకెక్కడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఐఏఎస్ రోహిణి సింధూరిపై ఐపీఎస్ రూపా మౌద్గిల్ చేసిన వ్యాఖ్యలు, ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై అటు ఉద్యోగవర్గాల్లో, ఇటు ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం.. ఇద్దరు అధికారులను పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసింది.

దీంతో పాటు రూపా మౌద్గిల్ భర్త, ఐఏఎస్ మునీశ్ మౌద్గిల్ ను కూడా వేరే శాఖకు బదిలీ చేసింది. ఈ విషయంపై రోహిణి కోర్టును ఆశ్రయించడంతో.. రోహిణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని రూపకు కోర్టు సూచించింది. రోహిణి వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసి జరుగుతున్న ప్రచారాన్ని ఆపాలని, నిరాధార వార్తలు, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న ఫొటోలను ప్రచురించకూడదని మీడియాను కోర్టు ఆదేశించింది.