సూపర్ స్టార్ ను కలిసిన మంచు విష్ణు ప్యానల్

మూవీ ఆర్టిస్ అసోసియేషన్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్యానల్ సభ్యులు ప్రచారం ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్యానల్ సభ్యులు నామినేషన్ల వేయడం జరిగింది. ఈ ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు మంచు విష్ణు ప్యానల్ కు మధ్య పోటీ సాగుతుంది. ఎవరికీ వారే తమ గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులతో కలిసి సూపర్ స్టార్ కృష్ణను కలిశారు. మోహన్ బాబుతో పాటు ప్యానల్‌ సభ్యులందరు కలిసి కృష్ణ ఇంటికి వెళ్లారు. కృష్ణ మద్దతు తమకు ఉందని మొదటి నుంచి విష్ణు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో విష్ణు తన ప్యానల్‌తో కృష్ణను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. స్వతంత్ర అభ్యర్ధిగా జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ దాఖలు చేసిన నిర్మాత బండ్ల గణేష్.. అనూహ్యంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. నిన్నటివరకు జీవిత మీద పోటీచేస్తానని చెప్పుకొచ్చిన బండ్ల సడన్‌గా వెనకడుగేశారు.. తన మద్దతు పూర్తిగా ప్రకాష్ రాజ్ కే అని ప్రకటించారు. నాదైవ సమానులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయుల సలహామేరకు జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పుకున్నట్లు ట్విట్టర్లో ప్రకటించాడు. తాజాగా ప్రకాష్ రాజ్ అన్న నా దగ్గరకు వచ్చి పోటీ నుంచి విరమించుకోవాలని కోరడంతో తాను పోటీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. తన మద్దతు ప్రకాష్ రాజ్ ప్యానల్ కే అని తెలిపారు.