అనాథ పిల్లలకు ఫ్రీ గా ‘ఆదిపురుష్’ చిత్రాన్ని చూపిస్తున్న మంచు మనోజ్

మరో రెండు రోజుల్లో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా టికెట్ బుకింగ్ ఓపెన్ అవ్వగా..అన్ని చోట్ల హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలో మంచు మనోజ్ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదిపురుష్ 2500 టికెట్లను బుక్ చేసి రెండు రాష్ట్రాల్లో ఉన్న అనాథ పిల్లలకు చూపించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంచు మనోజ్–మౌనిక దంపతుల నుంచి ప్రకటన వచ్చింది.

మరోపక్క సినిమా ప్రదర్శితం అయ్యే ప్రతీ షోలో ఒక సీటును హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచాలని, కొన్ని టికెట్లను రామాలయాలకు, పేద చిన్నారులకు ఇవ్వాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నిరుపేద పిల్లల కోసం 10వేల టికెట్లను బుక్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా పదివేల టికెట్లు బుక్ చేసి పేదలకు పంచుతామని తెలిపారు. ఈ ఉద్దేశంతోనే బాలీవుడ్ సింగర్ అనన్య బిర్లా కూడా పదివేల టికెట్లు బుక్ చేసుకున్నారు. శ్రేయాస్ మీడియా ఖమ్మం జిల్లాలోని 1103 గ్రామాలలో ఒక్కో రామాలయానికి 101 టికెట్లు బుక్ చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం సుమారు లక్ష పైచిలుకు టికెట్లను బుక్ చేసారు. ఇలా అనేకమంది ఆదిపురుష్ కోసం సొంత డబ్బును ఖర్చు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ప్రభాస్ – కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ లంకాధిపతి రావణాసురుడుగా కనిపిస్తుండగా రాముడి గా ప్రభాస్ , సీతగా కృతి కనిపించనున్నారు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. జూన్ 16 న పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.