ఇండిగో విమానంలో మంచు లక్ష్మి కి చేదు అనుభవం

ఈ మధ్య తరచూ పలు విమాన సంస్థలు వివాదంలో నిలుస్తున్నాయి. సరైన సదుపాయాలు అందివ్వకపోవడం తో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రజల గగ్గోలు బయటకు రాకపోయినప్పటికీ , సినీ ప్రముఖులకు ఎదురైనా చేదు అనుభవాలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి. తాజాగా సినీ నటి మంచు లక్ష్మి కి ఇండిగో విమానంలో చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసి ఇండిగో విమాన సంస్థ ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది.

సోమవారం తిరుపతి నుంచి మంచు లక్ష్మి హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఆమె ఈ క్రమంలో తన బ్యాగ్ ను మరచిపోయారు. విషయాన్ని విమాన సిబ్బందికి తెలిపారు. అయితే, దాదాపు 40 నిమిషాల పాటు గేటు బయట వెయిట్ చేశానని, సిబ్బంది ఎవరూ కూడా అసలు పట్టించుకోలేదని ఇండిగోను ట్యాగ్ చేస్తూ లక్ష్మి ట్వీట్ చేశారు. తాను 103 డిగ్రీల జ్వరంతో ఉన్నానని, తన పర్స్ మరిచిపోయినట్టు సిబ్బందికి తెలిపినా స్పందించలేదన్నారు.

తాను తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి కూడా అంత సమయం పట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. గంటకు పైగా ఎదురు చూసినా తన పర్స్ తెచ్చివ్వలేదని ఆమె మరో ట్వీట్ చేశారు. గ్రౌండ్ స్టాఫ్ ఒక్కరు కూడా రాలేదని, అసలు ఒక్క కస్టమర్ సర్వీస్ కూడా లేకుండా ఇండిగో ఎలా నడుస్తోందంటూ ఆమె ప్రశ్నించారు. ‘బ్యాన్ ఇండిగో’ అని హ్యాష్ ట్యాగ్ జత చేశారు. చివరకు స్పందించిన ఇండిగో అసౌకర్యానికి క్షమాపణ చెప్పింది. తమ మేనేజర్ తో మాట్లాడించినట్టు ట్వీట్ చేసింది. ‘మా మేనేజర్ మీకు సహకరిస్తారు.. మీరు లగేజ్ కలెక్ట్ చేసుకుని ఉంటారని భావిస్తున్నాం. తిరిగి మీరు మా ఫ్లైట్‌లో ప్రయాణిస్తారని ఆశిస్తున్నాం’ అని ఇండిగో పేర్కొంది.