SR నగర్ లో దారుణం : ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో యువతి కళ్లల్లో కారం చల్లి కత్తితో దాడి

పోలీసులు , కోర్ట్ లు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్న ప్రేమ ఉన్మాదులు తగ్గడం లేదు. ప్రేమ పేరుతో యువతులను వేధించడం..ప్రేమను తిరస్కరిస్తే వారిపై దాడి చేయడం , చంపడం చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగగా..తాజాగా హైదరాబాద్ లోని SR నగర్ లో మరో ప్రేమ ఉన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదనే కోపంతో యువతి కళ్లల్లో కారం చల్లి కత్తితో దాడి చేసాడు.

వివరాల్లోకి వెళ్తే..

మహబూబ్​నగర్​ జిల్లాకు చెందిన 28 ఏళ్ల యువతి 17 ఏళ్లుగా బోరబండ పరిధిలోని బంజారానగర్​లో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్​లో హౌస్​కీపింగ్​గా పని చేస్తున్నది. అదే మాల్ లో మోతీనగర్​కు చెందిన కిశోర్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. వీరిద్దరికీ ఆరేళ్లుగా పరిచయం ఉంది. తనను ప్రేమించాలని కిశోర్ ఆమె వెంటపడేవాడు. చాలాసార్లు అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్​తో కూడా గొడవ పడ్డాడు. కొన్ని రోజుల కింద అమ్మాయికి మరో వ్యక్తితో ఎంగేజ్​మెంట్ అయ్యింది. ఇది తెలుసుకున్న కిశోర్, ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

సోమవారం సాయంత్రం బాధిత యువతి ఇంటికెళ్తుండగా బంజారానగర్​లో అడ్డుకున్నాడు. కండ్లలో కారం చల్లి కత్తితో దాడి చేశాడు. గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె మెడ, ఎడమ చేతికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు కిశోర్ ని పట్టుకుని చితకబాదారు. అమ్మాయిని హాస్పిటల్​కు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, యువతికి ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. బాధితురాలి స్టేట్​మెంట్​ రికార్డు చేసిన పోలీసులు.. కిశోర్​పై కేసు నమోదు చేసారు.