ఇక పై తెలంగాణలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్

telangana-job-calendar-in-every-year

హైదరాబాద్‌ః తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. ఇక నుంచి జాబ్ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయా అని ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ తరహాలో నిర్ణీత కాలవ్యవధితో ఏటా జనవరి 1న టీఎస్‌పీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక బోర్డులు, సంస్థల ఆధ్వర్యంలో జాబ్‌ క్యాలెండర్లు ప్రకటించాలని యోచిస్తోంది. ఇందుకోసం కసరత్తు కూడా షురూ చేసింది.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రామాణిక రాష్ట్రస్థాయి ముసాయిదా జాబ్‌ క్యాలెండర్‌ సిద్ధమవుతోంది. దీన్ని త్వరలోనే ప్రభుత్వానికి పంపించనుంది. సర్కార్ అనుమతించిన వెంటనే ఈ ఏడాది నుంచి జాబ్‌ క్యాలెండర్‌ అమల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. నూతన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరహాలో ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రస్థాయి ఉద్యోగాలకు ప్రామాణిక జాబ్‌ క్యాలెండర్‌ సిద్ధం చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.