ట్యాంక్‌బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పెట్టాలని ఈటెల డిమాండ్

ట్యాంక్‌బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేసారు హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఈటల రాజేందర్ నివాళులర్పించారు. అనంతరం అక్కడి బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని ఈటెల డిమాండ్ చేశారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్థంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయిన కేసీఆర్, దేశ ప్రజల నమ్మకాన్ని కూడగడతాడా? అని వ్యాఖ్యానించారు. గూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయితీస్తాడా? అని ఈటల ఈ సందర్భంగా ఎద్దేవా చేసారు. దేశ ప్రజలు కేసీఆర్ ను ఒక బఫూన్ లా చూస్తున్నారన్న ఈటల… ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ చతికిలపడిందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నియంతృత్వం, దోపిడీని అరికట్టలేకపోయారని రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు వెల్లడించారు. బీజేపీకి మాత్రమే ఆసత్తా ఉందని.. అందుకే ఆయన బీజేపీలో చేరారని స్పష్టం చేశారు. ధర్మానికి కట్టుబడి రాజీనామా చేసి.. ప్రజల ముందుకు వచ్చారని వివరించారు. కేసీఆర్‌ను ఓడించడానికి.. అనేకమంది ప్రజాప్రతినిధులు, నాయకులు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. సర్పంచ్‌లకు బిల్లులు రావాలి అంటే.. టిఆర్ఎస్ పార్టీలో చేరాలి.. లేదంటే పదవే పీకేస్తామని బెదిరిస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. చాలా మంది సర్పంచ్‌లు ఫోన్ చేసి చెప్తున్నారని వెల్లడించారు. తాము మనుషులుగా టీఆర్ఎస్‌లో ఉన్నా.. మనసంతా బీజేపీతోనే ఉందని చెప్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు గుణపాఠం చెప్పకపోతే.. బతుకు లేదని అంటున్నారని.. కట్టుబానిసలుగా చూస్తున్నారని చెబుతున్నట్టు వివరించారు.