త్వ‌ర‌లోనే రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీపై కార్యాచ‌ర‌ణ‌..భ‌ట్టి విక్ర‌మార్క

Mallu Bhatti Vikramarka

హైదరాబాద్ః అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్​ను ప్రవేశపెడుతున్నారు.

కీల‌క శాఖ‌ల‌కు కేటాయింపులు ఇలా..

నీటిపారుద‌ల శాఖ‌కు రూ. 28,024 కోట్లు
విద్యారంగానికి రూ. 21,389 కోట్లు
వైద్యారోగ్య రంగానికి రూ. 11,500 కోట్లు
గృహ‌జ్యోతి ప‌థ‌కానికి రూ. 2,418 కోట్లు
ట్రాన్స్‌కో, డిస్క‌మ్‌ల‌కు రూ. 16,825 కోట్లు
గృహ నిర్మాణ శాఖ‌కు రూ. 7,740 కోట్లు

రైతుల రుణ‌మాఫీపై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శాస‌న‌స‌భ‌లో ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా భ‌ట్టి రైతు రుణ‌మాఫీపై మాట్లాడారు. ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణ‌మాఫీ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌బోతున్నామ‌ని తెలిపారు. రూ. 2 లక్ష‌ల రుణ‌మాఫీపై త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. అందుకు విధివిధానాల‌ను రూపొందిస్తున్నాం. ప్ర‌తి పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర కూడా అందిస్తామ‌న్నారు.

రాష్ట్రంలోని కౌలు రైతుల‌కు కూడా రైతు భ‌రోసా సాయాన్ని ఇవ్వ‌డానికి మార్గ‌ద‌ర్శ‌కాలు సిద్ధం చేస్తున్నామ‌ని ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క శాస‌న‌స‌భ‌లో ప్ర‌క‌టించారు. ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్‌లో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. రైతుబంధు నిబంధ‌న‌ల‌ను పునఃస‌మీక్ష చేసి నిజ‌మైన అర్హుల‌కు రైతు భ‌రోసా కింద ఎక‌రాకు రూ. 15 వేలు అందించేందుకు కృత‌నిశ్చ‌యంతో ఉన్నామ‌ని తెలిపారు. అదే విధంగా ప్ర‌ధాన మంత్రి ఫ‌స‌ల్ భీమా యోజ‌న కార్య‌క్ర‌మాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో పంట‌ల భీమా ప‌థ‌కాన్ని ప‌టిష్టంగా అమ‌లు చేయ‌బోతున్నామ‌ని తెలిపారు. రైతుబీమా ప‌థ‌కాన్ని కౌలు రైతుల‌కు కూడా అమ‌లు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. అందుకు అవ‌స‌ర‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందిస్తున్నామ‌ని చెప్పారు.

నాసిర‌కం విత్త‌నాల‌ను, న‌కిలీ విత్త‌నాల‌ను అరిక‌ట్టేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. రైతుకు న‌ష్టం చేసే ఏ విత్త‌న వ్యాపారినీ కూడా త‌మ ప్ర‌భుత్వం ఉపేక్షించ‌దు. నాణ్య‌మైన విత్త‌న ఉత్ప‌త్తి విష‌యాల్లో పురోభివృద్ధి సాధించేందుకు స‌క‌ల చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. ఈ మేర‌కు త్వ‌ర‌లో ఒక నూత‌న విత్త‌న విధానం తీసుకురాబోతున్నామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.