మహారాష్ట్రలో లారీ బీభత్సం.. 10 మంది మృతి

Maharashtra: 10 dead as truck rams into highway hotel in Dhule

ముంబయి : మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో మంగళవారం ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. హైవేపై ప్రయాణిస్తున్న ఓ లారీ అదుపుతప్పి, వాహనాలను ఢీకొడుతూ, ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని సిర్పూర్, ధూలేలలోని ఆసుపత్రులకు తరలించి, చికిత్స చేయిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మధ్య ప్రదేశ్ నుంచి ధూలే వైపు వెళ్తున్న లారీ మంగళవారం ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ముంబయి-ఆగ్రా హైవేపై పలస్నేర్ గ్రామం సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో డ్రైవర్ అదుపు చేయలేకపోయారు. దీంతో రెండు మోటారు సైకిళ్లను, ఓ కారును, మరో కంటెయినర్‌ను ఢీకొట్టింది. అదే వేగంతో బస్టాప్ పక్కన ఉన్న ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత తలక్రిందులైంది. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. గాయపడినవారిని సిర్పూర్, ధూలేలలోని ఆసుపత్రులకు తరలించి, చికిత్స చేయిస్తున్నారు. ఈ ప్రమాదం బాధితుల్లో బస్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు కూడా ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.