కునో నేషనల్ పార్కులో చీతాల కొట్లాట..‘అగ్ని’కి తీవ్రగాయలు

Madhya Pradesh: Translocated cheetah injured in fight at Kuno National Park

భోపాల్‌ః భారత్‌లో అంతరించిపోయిన చీతాల సంతతి వృద్ధి కోసం ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టిన చీతాల్లో కొన్ని ఇప్పటికే మరణించగా ఉన్నవి పోట్లాడుకుంటున్నాయి. ఇతర చీతాలతో జరిగిన పోరులో ఓ చీతా తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. గాయపడిన చీతా ‘అగ్ని’కి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని, దాని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలు గౌరవ్, శౌర్య- దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన అగ్ని, వాయు పరస్పరం తలపడ్డాయి. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో పార్కులోని ఫ్రీ రేంజ్ ప్రాంతంలో కొట్లాటకు దిగాయి. గమనించిన అధికారులు వాటిని చెదరగొట్టేందుకు పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు. అడవిలో ఇలాంటి ఫైటింగ్ సీన్స్ సర్వసాధారణమేనని అధికారులు తెలిపారు.

నమీబియా నుంచి తీసుకొచ్చిన ఐదు ఆడ, మూడు మగ చీతాలను గతేడాది సెప్టెంబరు 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కునో నేషనల్ పార్కులో విడిచిపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలను తీసుకొచ్చారు. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఆరు చీతాలు మరణించాయి. వీటిలో మూడు కూనలు కూడా ఉన్నాయి.