మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం..14 మంది మృతి

madhya pradesh road accident.. 14 people died

న్యూఢిల్లీః మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. దిండోరీలోని బంద్​ఝర్ ఘాట్ ప్రాంతంలో ఓ పికప్ వాహనం నియంత్రణ కోల్పోయి బోల్తా పడిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు షాపురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్​లో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం తెల్లవారుజాముకు ముందు 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితులంతా జిల్లాలోని షాపురా బ్లాక్​లో ఉన్న అమ్హాయి దేవ్రీ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నారని చెప్పారు. సీమంతం వేడుకకు హాజరై తమ స్వగ్రామానికి వీరంతా వెళ్తున్నట్లు చెప్పారు. షాపురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్​లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం తరలించినట్లు తెలిపారు.

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.