గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు ప్రజలు హర్షం

ప్రస్తుతం నిత్యావసర ధరలు ఆకాశానికి తాకుతున్న వేళ..కేంద్రం వంట గ్యాస్ ధర భారీగా తగ్గించి ప్రజలను సంతోష పరిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్యాస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఇలా ప్రతి నెల గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతుండడం తో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పల్లెల్లో అయితే మళ్లీ కట్టెల పొయ్యిల ఫై వంట చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు కేంద్రం ఫై విమర్శలు చేస్తూ..తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంట గ్యాస్ ధర రూ.500 మేర తగ్గిస్తామని ప్రకటిస్తూ వస్తుంది. దీంతో అలర్ట్ అయినా కేంద్రం తాజాగా గ్యాస్ ధరలను ఏకంగా రూ. 400 తగ్గించింది.

సాధారణ సిలిండర్ ధరపై రూ.200, ఉజ్వల్ పథకం గ్యాస్ సిలిండర్లపై రూ.400 తగ్గిస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. ఇది రక్షా బంధన్ పర్వదినం నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ మహిళలకు ఇస్తున్న కానుక అని అభివర్ణించింది. ఈ నిర్ణయం ఫై ప్రజలతో పాటు పలు పార్టీల నేతలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. గృహ వినియోగదారులు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ.200 మేర తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని వైసీపీ స్వాగతిస్తోందని తెలిపారు.

మోదీ తీసుకున్న ఈ నిర్ణయం కోట్లాది మంది ప్రజలకు డబ్బును ఆదా చేస్తుందని, ఆ డబ్బును ఇతర అవసరాలకు ఉపయోగించుకునేలా ఈ నిర్ణయం తోడ్పడుతుందని విజయసాయి వివరించారు. పెద్ద సంఖ్యలో ఉన్న మధ్య తరగతి ప్రజలకు ఈ నిర్ణయం ఓ వరంలాంటిదని అభివర్ణించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత మాత్రం మోడీ తీసుకున్న నిర్ణయం ఫై ఫైర్ అయ్యారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎల్పీజీ గ్యాస్‌పై భారీ తగ్గింపు అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది. 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా సిలిండర్‌ ధర పెంచుకుంటూ వెళ్లిన మోదీ సర్కార్‌.. ఉన్నపళంగా రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పైగా ఇది మహిళా సోదరీమణులకు రాఖీ కానుక అంటూ చెప్పుకొచ్చింది. 2014లో రూ.400గా ఉన్న వంట గ్యాస్‌ ధరను రూ.1200కు పెంచి.. ఇప్పుడు అందులో నుంచి రూ.200 తగ్గించి మహిళలకు కానుక అనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసారు కవిత. ఇన్నేండ్లుగా వంట గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచి.. ఇప్పుడు నామమాత్రంగా తగ్గించి పేదలకు ఎంతో లబ్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు.