ప్లీనరీ ఫై టీడీపీ నేతల విమర్శలు

వైస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు ముగిసాయి. జగన్ అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి ఈ ప్లీనరీ ని ఏర్పటు చేసారు. ప్లీనరీ కి పెద్ద ఎత్తున కార్య కర్తలు , నేతలు హాజరై విజయవంతం చేసారు. ఇక ప్లీనరీ వేదికగా పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. సీఎం జగన్ తో పాటు నేతలంతా వారి వారి ప్రసంగాలతో కార్యకర్తల్లో , పార్టీ లో కొత్త ఉత్సహం తీసుకొచ్చారు. ఇదిలా ఉంటె ప్లీనరీ ఫై టీడీపీ నేతలు పలు విమర్శలు చేస్తూ వస్తున్నారు.

జగన్ నీతిపరుడైతే సీబీఐ విచారణకు ఎందుకు హాజరవ్వడం లేదు?అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబం ప్రకటించినట్లు జగన్‌ కూడా ఆస్తులు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం, ఇసుక, సిమెంట్ సిండికేట్ వ్యాపారం చేస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. జీవితకాల అధ్యక్షుడుగా ప్రకటించుకున్న జగన్‌ని మించిన పెత్తందారు లేరన్నారు.

రైతు సమస్యలపై వైసీపీ ప్లీనరీలో ఒక్క మాట కూడా లేదని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. ప్లీనరీలో మోటార్లకు మీటర్లు రద్దు తీర్మానం ఎందుకు చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు. మోటార్లకు మీటర్లు పెడితే అన్ని సంక్షేమ పథకాలు రద్దవుతాయన్నారు. మీటర్లు ఎవరొచ్చి బిగిస్తారో.. వారిముందే వాటిని పగలకొడతామన్నారు. మూడేళ్లలో జగన్ రెడ్డి రాష్ట్రానికి ఒక్కమేలైనా చేశాడా? అని ప్రశ్నించారు.

మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత సైతం ప్లీనరీ సమావేశాల ఫై విమర్శలు గుప్పించారు. పార్టీ ప్లీనరీనా లేక విజయమ్మ వీడ్కోలు సభానా ? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్లీనరీలో విజయమ్మ రాజకీయ భవిష్యత్ కి సమాధి కట్టినట్టేనని, విజయమ్మ ఎప్పుడో పార్టీ నుండి దూరమయ్యారన్నారు. విజయమ్మ తెలంగాణని షర్మిలమ్మకి, కొడుకుకి ఏపీకి అప్పజెబుతారట.. రాజశేఖరరెడ్డి సంపాదించిన ఆస్తులను పంచండి.. అంతేకాని రాష్ర్టాలను పంచే అధికారం ఎవరిచ్చారు అని ఆమె ప్రశ్నించారు. అవకాశం ఉంటే కత్తులు, కటారులు, బాంబులు ముందు పెట్టుకొని శాశ్వత సీఎంగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించుకొందురేమో అని ఆమె మండిపడ్డారు.