తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రూ.500లకే గ్యాస్ సిలిండర్ – రేవంత్

తెలంగాణ లో మరో ఐదు , ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. అలాగే కాంగ్రెస్ , బిజెపి పార్టీలు సైతం ఈసారి ఎలాగైనా తెలంగాణాలో గెలిచి తీరాలని ట్రై చేస్తున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ వాగ్దానాలు చేయడం మొదలుపెట్టారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చారు. కాంగ్రెస్ పీపుల్ మార్చ్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర ఉన్న పాలమూరును అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి చేస్తామన్న సీఎం కేసీఆర్ వాగ్ధానం ఏమయ్యింది అని ప్రశ్నించారు. బ్రతుకు దెరువు కోసం ఉన్న ఊరిని వదిలి లక్షల మంది వలస పోతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

కేసీఆర్ ను పాలమూరు ప్రజలు అక్కున చేర్చుకుంటే ఆయన ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. 60 సంవత్సరాల ప్రజల ఆకాంక్షలను సోనియాగాంధీ నెరవేర్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని అన్నారు. కానీ కేసీఆర్ మాత్రం బర్రెలు, గొర్రెలు ఇచ్చి సరిపెట్టుకోమంటున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పాలమూరు అభివృద్ధి చెందిందని అన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్న లక్ష్మారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిని గాలికి వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడని ఆరోపించారు. 2024 కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని రేవంత్ అన్నారు.