టీచర్లను వేధించడం పరిపాటిగా మారింది: లోకేశ్‌

మెసేజ్ ని ఫార్వార్డ్ చేసినంత మాత్రాన ఉపాధ్యాయుడిపై సస్పెన్ష‌న్ వేటు వేస్తారా?: లోకేశ్‌

అమరావతి : టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్‌. నాయుడును సస్పెండ్ చేశారంటూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సప్‌లో సందేశాలు పంపుతున్నారని ఫిర్యాదు రావ‌డంతో ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలిపారు. ఈ విష‌యాన్ని లోకేశ్ ప్ర‌స్తావించారు. ‘సామాజిక మాధ్యమాల్లో ఎవరో పంపిన మెసేజ్ ని ఫార్వార్డ్ చేస్తేనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తే, విద్యాబుద్ధులు నేర్పే గురువులకు త‌న చీప్ లిక్క‌ర్ అమ్మే మ‌ద్యం దుకాణాల ముందు డ్యూటీవేసిన వైఎస్ జ‌గ‌న్ గారిని ఏం చెయ్యాలి?’ అని లోకేశ్ నిలదీశారు.

‘సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ విశాఖ జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం ప్రాథమిక పాఠ‌శాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్. నాయుడు గారిని సస్పెండ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరిస్తూ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ‌ని హరిస్తోంది వైకాపా ప్రభుత్వం’ అని ఆయ‌న మండిప‌డ్డారు. ‘మాస్టారిపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివెయ్యాలి. జగన్ రెడ్డి పాలనలో టీచర్లను వేధించడం పరిపాటిగా మారింది. ఉపాధ్యాయుల స‌మ‌స్యల పరిష్కారం కోసం చేసే ప్రతి పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తుంది’ అని లోకేశ్ చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/