ఏపీలో ఆగని అంబులెన్స్ మాఫియా ఆగడాలు

ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన..పోలీసులు వార్నింగ్ లు ఇచ్చిన ఏపీ లో మాత్రం అంబులెన్స్ మాఫియా ఆగడాలు ఆగడం లేదు. వారు అడిగినంత ఇవ్వకపోతే అంబులెన్స్ లు బయటకు తీయడం లేదు. ఆ మధ్య రుయా ఆస్పత్రి లో అంబులెన్స్‌ మాఫియా అడిగినంత డబ్బు ఇచ్చుకోలేక ఓ తండ్రి… కన్నకొడుకు మృతదేహాన్ని తన భుజాలపై మోసుకెళ్లిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటన తర్వాత ప్రైవేట్‌ అంబులెన్స్‌ మాఫియాపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. అధికారులు , రాజకీయ నేతలు సైతం మరోసారి ఇలాంటి ఘటనలు పునావృతం కాకుండా చేసుకుంటామని మాట ఇచ్చినప్పటికీ, రాష్ట్రంలో మాత్రం అంబులెన్స్‌ మాఫియా ఆగడం లేదు.

తాజాగా తిరుపతి జిల్లా గూడూరులో రోడ్డుప్రమాదంలో మరణించిన ఓ యువకుడి మృతదేహాన్ని తరలించడానికి వేల రూపాయలు డిమాండ్ చేయడంతో అంబులెన్స్‌ మాఫియా ఆగడాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. అంబులెన్స్‌ డ్రైవర్లు అడిగినంత ఇచ్చుకోలేక, బయటి నుంచి వాహనాన్ని పిలిపించుకోవడంతో అడ్డుకుంది మాఫియా. దాంతో, బాధితులు ఆందోళనకు దిగారు. కూలి చేసుకుని బతికే తాము, పదిహేను కిలోమీటర్లకు నాలుగు వేలు అడిగితే ఎక్కడ్నుంచి తెచ్చివ్వాలంటున్నారు బాధితులు. రాష్ట్రంలో ప్రతి హాస్పిటల్‌ దగ్గర ఇలాంటి పరిస్థితులే ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం ధరలు నిర్ణయించినా, సిండికేట్‌ అవుతోన్న ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్లు.. బాధితులను రాబందుల్లా పీక్కూతినేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, ఆస్పత్రి వర్గాలు చూసీచూడనట్లు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది.