మున్సిపల్ కార్మికుల వేతనాన్ని రూ.21 వేల‌కు పెంచిన ఏపీ సర్కార్

మున్సిపల్‌ కార్మికుల సమస్యల పట్ల ఏపీ సర్కార్ చర్చలు జరిపింది. గత నాల్గు రోజులుగా తమ డిమాండ్స్ ను సర్కార్ నెరవేర్చాలని కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో స‌మ్మె విర‌మ‌ణ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్న సీఎం జ‌గ‌న్ ఆదేశాల‌తో రంగంలోకి దిగిన మంత్రుల క‌మిటీ కార్మిక సంఘాల నేత‌ల‌తో ఇప్ప‌టికే చ‌ర్చ‌లు జ‌రిపింది. కార్మికుల హెల్త్ అలవెన్సు 6 వేల రూపాయలు అలాగే ఉంచాలని సమావేశంలో సీఎం నిర్ణయం తీసుకున్నారని మంత్రి సురేష్ తెలిపారు.

హెల్త్ అలవెన్సుతో కలిపి వేతనం 21 వేలు ఇవ్వాలని సీఎం సూచించారని.. మిగతా డిమాండ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి సురేష్ వెల్లడించారు. ప్రధాన డిమాండ్లు పరిష్కరించినందున సమ్మె విరమించాలని మంత్రి కోరారు.అంతకుముందు రాష్ట్రంలోని పురపాలిక సంఘాల కమిషనర్లతో మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

సమ్మె అనంతర పరిస్థితులపై మంత్రి సురేశ్ ఆరా తీశారు. సమ్మె నేపథ్యంలో చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలు, ఎక్కడెక్కడ ఎంతమంది పారిశుద్ధ్య నిర్వహణకు హాజరవుతున్నారని అడిగి తెలుసుకున్నారు. చెత్త పేరుకుపోకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మంత్రి సూచించారు. అవసరమైన చోట ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా పనులు చేపట్టి చెత్తను తొలగించాలని ఆదేశించారు.