ఆత్మకూరు ప్రభుత్వ ఆసుప‌త్రి ఘటన ఫై లోకేష్ ఆగ్రహం

ఏపీ ప్రభుత్వ హాస్పటల్స్ లలో డాక్టర్ల నిర్లక్ష్యం ప్రతి రోజు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుప‌త్రిలో దారుణం జరిగింది. గాయపడిన వ్యక్తికి చికిత్స చేయాల్సిన డాక్టర్..తనకు అవసరం లేదన్నట్లు హ్యాపీగా తన రూమ్ లో విశ్రాంతి తీసుకోవడం తో ఓ వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిసాయి. ఈ ఘటన పట్ల తెలుగుదేశం నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

“ప్రజారోగ్య దేవుడిగా ప్ర‌చారం చేసుకుంటోన్న జ‌గ‌న్ వాస్తవానికి ప్రజల పాలిట యముడిలా త‌యార‌య్యార‌ని విమ‌ర్శించారు. గాయపడిన లెక్చరర్ రామకృష్ణ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుప‌త్రిలో చేరడమే శాపమా? అని ప్రశ్నించారు. డ్యూటీ లో డాక్టర్ ఉండి కూడా స్వీపర్, సెక్యూరిటీ గార్డుతో చికిత్స చేయించ‌డం ఏంట‌ని నిల‌దీశారు. ఏపీలో జ‌గ‌న్ కి ప్ర‌జ‌లు ఇచ్చిన ఒక్క ఛాన్స్‌తో జనం బతకడానికి ఛాన్స్ లేకుండా పోయిందని విమ‌ర్శించారు. కక్షసాధింపు చ‌ర్య‌లే ల‌క్ష్యంగా జగన్ ప్రభుత్వం ప‌నిచేస్తోంటే ఏపీలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమై జనాల‌ ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని అన్నారు. లెక్చరర్ రామకృష్ణది ప్రభుత్వ హత్యేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు దిగజారుతున్నా స‌ర్కారు ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని అన్నారు.

నిన్న అనంతసాగరం వద్ద బైకుకు యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో రామకృష్ణ అనే లెక్చరర్ తో పాటు చిరంజీవి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో వారిని ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, వారిని పరిశీలించిన డ్యూటీ డాక్టర్.. ఒక్క ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లిపోయాడు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో చిరంజీవి అనే వ్యక్తిని ప్రైవేటు ఆసుపత్రికి పంపించారు.

అయితే, రామకృష్ణకు మాత్రం డ్యూటీ డాక్టర్ చికిత్స చేయలేదు. కట్టు కట్టడం దగ్గర్నుంచి సెలైన్ బాటిళ్లు పెట్టేదాకా అంతా సెక్యూరిటీ గార్డులు, కాంపౌండర్లు, స్వీపర్లే చూసుకున్నారు. వాళ్లు రామకృష్ణ తలకు కట్టిన కట్టు కూడా ఎంతోసేపు నిలవలేదు. కాసేపటికే అది ఊడి కిందపడిపోయింది. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు.