మాల్యా, నీర‌వ్‌, చోక్సీ ఆస్తులు బ‌దిలీ.. ఈడీ

న్యూఢిల్లీ: బ్యాంకులను మోసగించి, పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. రూ.9,371.17 కోట్ల విలువైన ఆస్తులను బదిలీ చేసినట్లు బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో వివరించింది. దీంట్లో విదేశాల్లో ఉన్న రూ.969 కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. ముగ్గురి వ‌ల్ల బ్యాంకుల‌కు జ‌రిగిన న‌ష్టంలో వారి ఆస్తులు అటాచ్ చేసి, సీజ్ చేసిన మొత్తం విలువ 80.45 శాతంగా ఉన్న‌ట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌ చెప్పింది.

నీర‌వ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజ‌య్ మాల్యాలు.. ప్ర‌స్తుతం విదేశాల్లో ఉన్నారు. వారిని ఇండియాకు ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అయితే ఈ ముగ్గురూ భార‌తీయ బ్యాంకుల నుంచి సుమారు రూ.22,585 కోట్లు రుణం తీసుకున్నారు. సీబీఐ న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ ముగ్గురికి చెందిన లావాదేవీల‌ను స‌మీక్షించింది. డ‌మ్మీ సంస్థ‌ల‌తో ఈ ముగ్గురు బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్న‌ట్లు ఈడీ చెప్పింది. విజ‌య్ మాల్యాను అప్ప‌గించేందుకు బ్రిట‌న్ కోర్టు అంగీక‌రించింది. ముగ్గురికి చెందిన ఆస్తుల‌ను త్వ‌ర‌లో వేలం వేయ‌నున్నారు. దాని ద్వారా ఆయా బ్యాంకుల‌కు సుమారు రూ.7981 కోట్లు జ‌మ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/