భక్తి విశ్వాసంతో జీవిద్దాం!

ఆధ్యాత్మిక చింతన

live with devotional faith!
live with devotional faith!

ఆస్తులు, అంతస్థులు, ఆలుబిడ్డలు, ఆరోగ్యం, అధికారం అన్ని బాగున్నప్పుడు అన్నీ మనం కోరుకొంటున్నట్టే జరిగిపోతున్నప్పుడు భగవంతుని పట్ల భక్తి, విశ్వాసాలు పుష్కలంగానే ఉంటాయి. ఆస్తికత్వంపై ఉపన్యాసాలను దండిగనే దంచిపడేస్తుంటాం. కొంచెం పరిస్థితులు తారుమారై, అనారోగ్యమై, దారిద్య్రం వెంబడిస్తే దేవుడు లేడండి, దయ్యం లేదండి, అన్నీ కట్టుకథలే, అన్నీ పుక్కిటిపురాణాలే అనటం మొదలుపెడతాం.

దరిద్రులై, రోగపీడితులై, భార్యాపిల్లలకు దూరమై, అష్టకష్టాలపాలైనా భగవంతునిపట్ల అచంచల విశ్వాసం గలవారిని గూర్చి వింటే నిజంగా అలాంటి వారు ఉన్నారా? అది సత్యమా? ఇప్పుడూ ఉండాలా? అని సందేహాన్నైనా వెలిబుచ్చుతారు.

మా దగ్గరి బంధువు ఒకామెను దాదాపు నలభై సంవత్సరాలు చూశాను. ఆమె చేయని నోములు, వ్రతాలు,పూజలు, పునస్కారాలు లేవంటే అతిశయోక్తి కాదు. అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించింది, అన్ని పుణ్యనదీనదాలలో స్నానం చేసింది, అన్ని గుళ్లూ గోపురాలలో ప్రార్థనలు చేసింది,

ఎన్నెన్నో దానధర్మాలను చేసింది. మనిషి ఎంతో, ఎంతెంతో మంచిది. మా మొత్తం బంధువర్గంలో ఏ ఒక్కరికీ, ఏనాడూ నచ్చని మాటనుగనీ, మనసుకు నొప్పికల్గించే మాటనుగానీ మాట్లాడి ఉండదు. ఏనాడూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె ముఖంలో విసుగునుగనీ, కోపాన్ని గాని చూడలేదు. అలాంటి వ్యక్తి మెదడు కేన్సర్‌తో 18నెలలు బాధపడింది.

తను బాధపడిందిగానీ ఏ ఒక్కరినీ బాధపెట్టలేదు, ఏ క్షణంలో కూడా భగవంతుని పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆమె వేదశాస్త్రాలను చదవలేదు. పాండిత్యంతో కూడిన ఉపన్యాసాలను ఇవ్వలేదు. ఓర్పు, సహనం, ప్రేమ నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఆమె, శారీరక వేదనను అనుభవిస్తూ కన్నుమూసింది గానీ భక్తి విశ్వాసాలను ఏమామ్రూ కోల్పోలేదు. నేను నా కళ్లారా చూసిన వ్యక్తి ఆమె.

ఈ సందర్భంలో సిక్కుల ఐదవగురువుగురుఅర్జున్‌దేవ్‌ నాకు గుర్తుకొస్తాడు. ఆనాటి చక్రవర్తి ఆజ్ఞానుసారంగా పంజాబ్‌ గవర్నర్‌ ఆయన్ను నానాహింసలు పెట్టాడు.

కె.యస్‌.దుగ్గల్‌ రచించిన ‘సిఖ్‌గురూస్‌ అనేగ్రంధంలో 196-197పుటల్లోనూ అర్జున్‌దేవ్‌జీ పడిన కష్టాలను గూర్చి చదువ్ఞతుంటే మన కళ్ల నుండి కన్నీరు బొటబొట రాలితీరుతాయి. ఆయన్ను ఎర్రగా కాలుతున్న పెన్నంపైన నగ్నంగా కూర్చోబెట్టి కాలేకాలే నిప్పులను ఆయనపైన పోశారట, సలసల మరిగే నీటిలో ముంచినారట. ఐదురోజులు చిత్రాతిచిత్రమైన హింసలకు గురిచేశారట.

లాహోర్‌కు చెందిన ముస్లిం ఫకీరు అర్జున్‌దేవ్‌ శిష్యుడట. ఆయన తన గురువ్ఞగారికి పెడుతున్న చిత్రహింసలను చూసి, కోపోద్రిక్తుడై మీరు నన్ను అనుమతించండి, నేను వీరిని వీరి సర్వసంపదలను, సమస్త లాహోర్‌ పట్టణాన్ని సర్వనాశనం చేస్తానని అర్జున్‌దేవ్‌జీని కరితే ఆయన ప్రశాంత వదనంతో అన్నారట, ‘సోదరా! ఇదంతా ఆ పరమాత్ముని అభీష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నదా?

ఆయన అభీష్టాన్ని నెరవేర్చటమే నాకు ప్రీతిపాత్రము అని లక్షలాది ప్రజలు చూస్తుండగా బొబ్బలతో నిండిన నగ్న శరీరంతో నడచుకొంటూ వ్లె రావి నదిలో దిగి, ‘తండ్రీ! నీ ఇచ్ఛ ఎంత తియ్యగా ఉంది అని మునిగాడట. పెద్ద అలవచ్చి ఆయన్ను తీసుకెళ్లిందట!

భక్తి అంటే అది. విశ్వాసమంటే అదే. సీతారాములు, నలదమయంతులు, ధర్మరాజాదులు పడిన కష్టాలను చదివి అవి ఒట్టి కథలులే అని మనం కొట్టిపారేయవచ్చు. నేను విన్నవించినవి నిన్న, మొన్నటి చారిత్రక, సంఘటనలు, మరుపురాని, మరవలేని యదార్థ విషయాలు. పూర్ణవిశ్వాసంతో జీవిద్దాం. అదే మన మనకు శ్రీరామరక్ష.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/