మేడారం జాతర.. గద్దెలపైకి చేరుకున్న సారలమ్మ

saralamma-reaches-to-medaram-gadde-from-kannepalli

వరంగల్‌ః మేడారం జాతరలో తొలి అంకం పూర్తయ్యింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం గద్దెకు చేరుకుంది. డప్పు డోలు వాయిద్యాలతో కోలాహలంగా బయల్దేరిన సారలమ్మ.. భక్తుల జయజయధ్వానాల మధ్య జంపన్న వాగు మీదుగా మేడారానికి చేరుకున్నది. పూనగొండ్ల నుంచి పడిగిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి వద్ద సారలమ్మకు స్వాగతం పలికారు. రెండేండ్ల తర్వాత వన దేవతల రాకతో ఒక్కసారిగా మేడారంలోని భక్తజనం పరవశంతో పులకించిపోయారు.

కాగా, గురువారం నాడు సమ్మక్క కూడా మేడారం గద్దెలపైకి చేరుకోనుంది. చిలుకలగుట్ట నుంచి తల్లి దిగి వచ్చి భక్తుల మొక్కులు అందుకోనుంది. సమ్మక్కను ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు.

మరోవైపు మేడారం జాతర రెండో రోజు అత్యంత కోలాహలంగా సాగుతోంది. భక్తకోటి జయజయధ్వానాల మధ్య మేడారం మహాజాతర బుధవారం ప్రారంభమైంది. మొదటి రోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులనూ గద్దెలపై కొలువుదీర్చారు. మహాజాతర రెండో రోజైన నేడు ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి రానుంది. మేడారం మహా జాతరలో అత్యంత కీలకఘట్టం సమ్మక్క ఆగమనమే. యావత్ భక్తకోటి ఆమె రాక కోసం ఎదురుచూస్తారు. గుట్ట దిగగానే జనం ఆమెకు జేజేలు పలుకుతారు. కాకతీయ సేనలపై అసామాన్య పోరాటపటిమను ప్రదర్శించి అడవి బిడ్డల గుండెల్లో వీరనారీమణిగా నిలిచి దేవతే సమ్మక్క. ఆమె రాక కోసం తనువెల్లా కళ్లు చేసుకుని భక్తులు ఎదురు చూస్తారంటే అతిశయోక్తి కాదు. గద్దెలపైన కొలువైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.