ఏపీ మందు బాబులకు షాకింగ్ న్యూస్..భారీగా పెరిగిన మద్యం ధరలు

ఏపీలోని మందుబాబులకు షాకింగ్ న్యూస్. మరోసారి రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరిగాయి. మద్యం MRP ఆధారంగా ARETని పెంచుతున్న కారణంగా.. ఈ శనివారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పెరిగాయి. తాజా ధరలతో క్వార్టర్‌ సీసాపై రూ.10, ఫుల్‌ బాటిల్‌పై రూ.20 వరకు ధరలు పెరిగిపోయాయి.

ప్రస్తుతం ఏఆర్‌ఈటీ శ్లాబుల ఆధారంగా రూపాయల్లో ఉన్నందున అన్ని బ్రాండ్లపై పన్నులు సమానంగా లేవని, అన్నీ ఒకేలా ఉండటం కోసం నిర్ణీత ధర నుంచి ఏఆర్‌ఈటీని శాతాల్లోకి మార్చాల్సిన అవసరం ఉందంటూ ఏపీఎస్‌డీసీఎల్‌ ప్రతిపాదనలు పంపగా.. వాటికి ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.. దీంతో.. సవరణలు చేస్తూ ఏపీ ఎస్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. ఆ ఉత్తర్వుల ప్రకారం.. ఐఎంఎఫ్‌ఎల్‌ కనీస ధర రూ.2,500లోపు ఉంటే దానిపై 250 శాతం, రూ.2,500 దాటితే 150 శాతం, బీరుపై 225 శాతం, వైన్‌పై 200 శాతం, ఫారిన్‌ లిక్కర్‌పై 75 శాతం ఏఆర్‌ఈటీ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఎక్సైజ్‌ శాఖ.. ఈ సవరణ ఫలితంగా మరోసారి మద్యం ధరలు పెరిగాయి.

ఇప్పటికే ఏపీలో చాలాసార్లు మద్యం ధరలు పెరిగాయి. ఏపీ సీఎం జగన్.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే, మద్యాన్ని సంపూర్ణంగా నిషేధిస్తామని ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక.. మద్యాన్ని కొనసాగించడమే కాకుండా.. ధరలను చాలాసార్లు పెంచారు. ఆ వచ్చిన రెవెన్యూతో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం అన్నది ప్రభుత్వ వెర్షన్‌గా ఉంది. కానీ మద్యం వినియోగదారులు మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్నారు.