కర్ణాటక లో బిజెపి మరో షాక్..కాంగ్రెస్ లో చేరిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవది

మరికొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండగా..బిజెపి పార్టీ కి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు బిజెపి కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో పార్టీ లో చేరగా..తాజాగా ఆ పార్టీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవది బీజేపీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్‌లో చేరారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి తాను చాలా చేశానని, తాను చనిపోయిన తర్వాత తన మృతదేహాన్ని బీజేపీ కార్యాలయం ముందు నుంచి తీసుకెళ్లొద్దని కోరారు.

ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఎన్‌వై గోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు పుట్టన్న, బాబూరావు బీజేపీకి గుడ్‌బై చెప్పారు. కాగా, లక్ష్మణ్‌ సవది బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌కు సన్నిహితుడు. యెడియూరప్పకు ప్రత్యామ్నాయ నేతగా లక్ష్మణ్‌ను సంతోష్‌ ప్రోత్సహించారనే చర్చ కర్ణాటక రాజకీయ వర్గాల్లో ఉన్నది. బీజేపీ ఇప్పటికి రెండు విడతలుగా 212 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో టికెట్ల నిరాకరణకు గురైన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, నేతల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి నెలకొన్నది. దాదాపు 35 నుంచి 45 నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు పొగలు కక్కుతున్నాయి. నేతల మద్దతుదారులు పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. పార్టీ తరపున ప్రచారం చేయబోనని టికెట్‌ లభించని మంత్రి ఎస్‌ అంగార తేల్చిచెప్పారు. పలుచోట్ల వందలాది మంది కార్యకర్తలు బీజేపీకి రాజీనామాలు చేస్తున్నారు. కొందరు శాసనసభ్యులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయగా మరి కొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.