రేపు భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu will visit Bhoodan Pochampally tomorrow

యాదాద్రి భువనగిరి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు(బుధవారం) భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు. భూదాన్ పోచంపల్లి పట్టణానికి రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హెలీప్యాడ్ వద్ద డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రత్యేక పోలీసు బలగాలు సభా ప్రాంగణాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రాష్ట్రపతి రాక సందర్భంగా పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్రపతి పర్యటించే ప్రదేశాలను అన్ని శాఖల అధికారులు సందర్శించి పరిశీలించారు.

రేపు ఉదయం 11.10 నుంచి మధ్యాహ్నం 12.10 వరకు రాష్ట్రపతి పర్యటన ఉంటుందన్నారు. పోచంపల్లి పట్టణ కేంద్రంలో టూరిజం పార్కులో మొదటగా వినోబావే విగ్రహానికి పూలమాల వేసి, అక్కడనుండి పక్కనే ఉన్న వినోబా మందిరంలో ఫొటో ఎగ్జిబిషన్‎ని పరిశీలించనున్నారు, అనంతరం పోచంపల్లిలోని నేతన్నల ఇండ్లలోకి వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకుంటారు. అనంతరం శ్రీరంజన్ పరిశ్రమలో పట్టుపురుగుల నుంచి పట్టుద్వారాన్ని తీసి చీరల తయారీ కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఆ తర్వాత శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్‎లో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించి, పద్మశ్రీ సంత్ కబీర్, జాతీయ అవార్డు గ్రహీతలతో మాట్లాడనున్నారు. వీటితో పాటు చేనేత మగ్గాల ప్రదర్శన ఉంటుందని అధికారులు తెలిపారు.