హేమంత్ సోరెన్‌ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

హైకోర్టే ఇందుకు తగిన వేదిక అని స్పష్టీకరణ

Land scam case.. Supreme Court rejects Hemant Soren’s plea against arrest, says ‘Go to High Court’

న్యూఢిల్లీః మనీలాండరింగ్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఝార్ఖండ్ మాజీ సీఎం, జేఎమ్ఎమ్ పార్టీ అధినేత హేమంత్ సోరెన్‌కు శుక్రవారం సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్‌ను విచారణకు స్వీకరించబోమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ పిటిషన్‌కు తగిన వేదిక సుప్రీంకోర్టు కాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎమ్ఎమ్ సుందరేశ్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. పటిషన్‌పై హైకోర్టును ఆశ్రయించాలని మాజీ సీఎంకు సూచించింది. తన అరెస్టును సవాలు చేస్తూ మాజీ సీఎం గురువారం దాఖలు చేసిన పటిషన్‌పై సుప్రీం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

ఝార్ఖండ్‌లో అక్రమ భూలావాదేవీలపై విచారణ జరుపుతున్న ఈడీ ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పీఎమ్ఎల్‌ఏ కోర్టు సోరెన్‌కు ఒక రోజు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే, పది రోజుల రిమాండ్ కావాలని ఈడీ కోరడంతో తీర్పును నేటికి రిజర్వ్ చేసింది.