క‌మ‌లా హ్యారిస్ కు తాత్కాలిక అమెరికా అధ్య‌క్షురాలిగా బాధ్యతలు

అధ్యక్షుడు జో బైడెన్ కు వైద్యపరీక్షలు
కొలనోస్కోపీ చేసిన వైద్యులు
తన బాధ్యతలను కాసేపు కమలాకు అప్పగించిన బైడెన్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొద్ది సమయం పాటు తన అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు అప్పగించారు. దీంతో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన‌ తొలి మహిళగా కమలా హ్యారిస్‌ రికార్డు సృష్టించారు. శుక్ర‌వారం రోజు ఒక గంటా 25 నిమిషాల పాటు క‌మ‌లా హ్యారిస్ అమెరికా అధ్య‌క్షురాలిగా కొన‌సాగారు. క‌మ‌లా హ్యారిస్ ప్రస్తుతం అమెరికా ఉపాధ్య‌క్షురాలిగా కొన‌సాగుతోన్న విష‌యం విదిత‌మే.

అయితే అమెరికా అధ్య‌క్షుడు జో బిడెన్ కొల‌నోస్కోపీ కోసం శుక్ర‌వారం అన‌స్థీషియా తీసుకున్నారు. కొలనోస్కోపీ చికిత్స స‌మ‌యంలో మత్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వైద్య పరీక్షలు పూర్తయ్యే సరికి కొంత సమయం పడుతుందని జో బిడెన్‌కు వైద్యులు చెప్పారు. దీంతో త‌న అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను ఆ స‌మ‌యం వ‌ర‌కు క‌మ‌లా హ్యారిస్‌కు అప్ప‌గించారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన కమలా హ్యారిస్ ఆ సమయంలో వైట్‌హౌస్‌లోని వెస్ట్ వింగ్‌లో ఉన్న తన కార్యాలయం నుంచే పనిచేశారు. 250 సంవత్సరాల అమెరికా చరిత్రలో ఒక మహిళ అధ్యక్షురాలిగా కొనసాగిన దాఖలాలు లేవు.

కాగా, అమెరికా రాజ్యాంగంలోని 25వ అధికరణ ప్రకారం అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతలు నిర్వహించే పరిస్థితిలో లేకపోతే తన అధికారాలను మరొకరికి బదిలీ చేసే అవకాశం ఉంది. రాజ్యాంగబద్ధంగానే ఆ కొంత సమయం పాటు తాత్కాలిక అధ్యక్షురాలిగా కమలా హారిస్ కొనసాగారు. ఇదే తరహాలో మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ కొలనోస్కోపీ పరీక్షల కోసం 2002, 2007లో తన అధికారాన్ని ఉపాధ్యక్షుడికి బదిలీ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/