మళ్లీ సొంతగూటికే వచ్చిన కుంభం అనిల్‌..

రెండు నెలల క్రితం కాంగ్రెస్ ను వీడి..బిఆర్ఎస్ లో చేరిన కుంభం అనిల్‌ కుమార్‌..తిరిగి సొంతగూటికే వచ్చాడు. ఈరోజు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కుంభం అనిల్ కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారని తెలిపారు.

పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు. కాంగ్రెస్ కుటుంబంలో చిరు సమస్యలు సహజమని చెప్పారు. తమ పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో అనిల్ ను పార్టీలోకి ఆహ్వానించామని తెలిపారు. నియోజకవర్గంలో కార్యకర్తల ఒత్తిడితో ఆయన మళ్లీ కాంగ్రెస్ లో చేరారని అన్నారు. భువనగరి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. భువనగిరి నియోజకవర్గంపై తాము కూడా సర్వే చేయగా 99 శాతం మంది అనిల్‌కు పాజిటివ్‌గా ఉన్నారని వ్యాఖ్యానించారు. జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆ సర్వే ఫలితాలను మాకు చెప్పారన్నారు.