కర్ణాటక ఎన్నికల్లో తండ్రి గెలుపు..కొడుకు ఓటమి

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి దిశగా సాగుతోంది. హస్తం హవా ముందు కమలం వాడిపోయింది. ఎగ్జిట్‌పోల్ అంచాలను రెట్టింపు చేస్తూ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని అందుకుంటోంది. ఇక జేడీఎస్ అధినేత కుమారస్వామి విజయం సాధిస్తే..ఆయన కొడుకు నిఖిల్ గౌడ ఓటమి పాలయ్యాడు. రామ‌న‌గ‌ర నుంచి పోటీ చేసిన నిఖిల్ కుమార గౌడ.. కాంగ్రెస్ అభ్యర్ధి చేతిలో ఓటమిపాలయ్యాడు. కుమార‌స్వామి భార్య రామ‌న‌గ‌ర నుంచి టికెట్‌ను త్యాగం చేసి నిఖిల్ కుమార‌గౌడ‌కు అవ‌కాశం ఇచ్చారు. అయితే కాంగ్రెస్ అభ్య‌ర్థి ఇక్క‌డ ఏకంగా ప‌దివేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రామనగరం స్థానం నుంచి నిఖిల్ గౌడ (జేడీఎస్) ఇక్బాల్ హుస్సేన్ (కాంగ్రెస్) మరిలింగగౌడ (బీజేపీ) పోటీపడ్డారు. ఈ త్రిముఖపోటీలో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించారు.

ఇక కుమారస్వామి విషయానికి వస్తే.. చెన్నపట్న స్థానం నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై కేవలం 460 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పటికే ఈ స్థానం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన తాజా ఎన్నికల్లో ఓటమి అంచు నుంచి అతి కష్టమ్మీద బయటపడ్డారు.