భద్రాచలంలో తగ్గిన వరద..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా విస్తారంగా భారీ వర్షాలు పడిన సంగతి తెలిసిందే. ఆకాశానికి చిల్లు ఏమైనా పడిందా అన్నట్లు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలకు వాగులు , వంకలు , చెరువులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తూ వచ్చింది. వారం రోజులుగా భద్రాచలం వద్ద 45 అడుగుల మేర ప్రవహిస్తూ రాగా..నిన్న ఏకంగా 55 అడుగులకు చేరింది. దీంతో అధికారాలు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు.

ఈరోజు మధ్యాహ్నం కాస్త వరద ఉదృతి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 52.2 అడుగులు ఉన్నది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఎత్తివేశారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. ఇంకా వరద కొనసాగుతుండడంతో అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వరదల నేపథ్యంలో ఇప్పటికే పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు గోదావరి నదిలో వరదను పరిశీలిస్తున్నారు.