హాస్పటల్ లో చేరిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి అనారోగ్యానికి గురి కావడంతో ఆయన్ను బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్ లో జాయిన్ చేసారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. వ్యూహా, ప్రతి వ్యూహాలతో పార్టీలు దూసుకు వెళుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి, తిరిగి అధికారం దక్కించుకోవాలని మూడు ప్రధాన పార్టీలు బీజెపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) యోచిస్తున్నాయి. కాగా, ఇందులో పోటీ మొత్తం బీజెపీ, కాంగ్రెస్ చుట్టూ తిరుగుతుండగా.. ఈ ఫలితాల్లో జేడీఎస్ కీ రోల్ ప్లే చేసే అవకాశాలున్నాయి.

ఈ ఎన్నికల్లో జెడీఎస్ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారుతో పాటు మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఈ క్రమంలో కుమారస్వామి అనారోగ్యానికి గురి కావడం ఆ పార్టీ కి షాక్ ఇచ్చింది. గత కొద్దీ రోజులుగా ఎన్నికల ప్రచారం, పార్టీ కార్యక్రమాలతో కుమారస్వామి బిజీబిజీగా గడుపుతున్నారు. తీరికలేకుండా ప్రయాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎండలకు ఆయన అస్వస్థతకు గురయ్యారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

వైద్య పరీక్షల తర్వాత కుమారస్వామి పార్టీ కార్యకర్తలు, అనుచరులను ఉద్దేశించి మీడియా ముందు మాట్లాడారు. తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో మళ్లీ పాల్గొంటానని, వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటానని తెలిపారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన పడవద్దని అభిమానులకు చెప్పారు.