ప్రధానికి పోస్ట్ కార్డును రాసిన కేటీఆర్

ప్రధాని మోడీకి పోస్ట్ కార్డు రాసారు మంత్రి కేటీఆర్. చేనేత కార్మికులకు సంబంధించిన పలు సమస్యలను తన పోస్ట్ కార్డులో ప్రస్తావించిన కేటీఆర్, ప్రధానంగా చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తన స్వహస్తాలతో రాసిన ఈ పోస్ట్ కార్డును ప్రధానమంత్రి కార్యాలయానికి పంపనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యలను అనేక సందర్భాల్లో వివిధ వేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానన్న కేటీఆర్, వాటిపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు తాను పలుమార్లు ప్రధానమంత్రికి స్వయంగా ఉత్తరాలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. చేనేత కార్మికులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, అవి చాలవన్నట్లు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తుల పై పన్ను వేసిందని విమర్శించారు.