నేడు చార్మినార్‌ వద్ద బీఆర్ఎస్ ధర్నా.. పాల్గొననున్న కేటీఆర్‌

రాష్ట్ర చిహ్నం మార్పిడిపై పోరుకు సిద్దమైన బీఆర్‌ఎస్‌ పార్టీ

ktr

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పిడిపై బీఆర్‌ఎస్‌ పార్టీ పోరుకు సిద్ధమైంది. అధికారిక చిహ్నం నుంచి చారిత్రక చిహ్నాలు చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించడంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చార్మినార్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ నాయకులతో కలిసి చార్మినార్‌కు చేరుకోనున్నారు.

కాగా, హైదరాబాద్‌ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది చార్మినార్. కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరినీ ఆకర్షించే చారిత్రక కళా రూపం. ఇదేదో ఒక రాజ్యానికి ప్రతీకగా, ఒక రాజు కీర్తికి గుర్తుగా జరిగిన నిర్మాణం కాదు. ఎందరినో బలి తీసుకున్న ప్రాణాంతకమైన ప్లేగు మహమ్మారి అంతమైనందుకు గుర్తు. అంతటి సదుద్దేశం ఉన్నందునే కాబోలు నాలుగు శతాబ్దాలకుపైగా చెక్కుచెదరకుండా ఆ కట్టడం నిలబడింది. హైదరాబాద్‌కే తలమానికం అది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అందుకే కేసీఆర్‌ ప్రభుత్వం అనేకమంది చరిత్రకారుల అభిప్రాయాలను క్రోడీకరించి ఈ చారిత్రక కళారూపానికి రాష్ట్ర అధికారిక చిహ్నంలో స్థానం కల్పించారు. కానీ రేవంత్‌ ప్రభుత్వం చార్మినార్‌ను రాజరికపు ఆనవాలుగా చూడటం అందరినీ ఆవేదనకు గురి చేస్తున్నది. ఏ ప్రభుత్వమైనా అరుదైన వారసత్వ కట్టడాలకు అంతర్జాతీయ గుర్తింపు రావాలని కోరుకుంటుంది. అయితే, ఇక్కడ ప్రతికూల దృక్పథంతో చారిత్రక నిర్మాణంపై రాజరికపు ముద్ర వేయడం దురదృష్టకరమని చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.