ఈరోజు రాష్ట్ర చిహ్నం, గీతం పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం

CM Revanth Reddy review meeting on state emblem and anthem today

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం రూపు, గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. దింతో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రెండింటినీ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఈరోజు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీల నేతలతో సచివాలయంలో సమావేశం అవుతారు సీఎం రేవంత్. అయితే ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్‌కు ఆహ్వానం పంపలేదు.ఇప్పటికే రాష్ట్ర చిహ్నం, గీతం రూపకల్పనపై సర్కార్ స్పీడ్ పెంచింది. అమరవీరుల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన నమూనాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం ఉన్న రాచరిక గుర్తులను చెరిపేస్తూ.. ప్రజాస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త లోగోను తయారు చేసే దిశగా కసరత్తు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.ప్రభుత్వ ఆదేశాల మేరకు 12 నమూనాలను రుద్ర రాజేశం తయారు చేసినట్లు సమాచారం. ఈ విషయమై ఇటీవల సీపీఐ, సీపీఎం నేతలతో పాటు ఉద్యమకారులు, పార్టీ నేతలు, కొందరు అధికారులతోనూ సీఎం చర్చించారు. తుది రూపంపై బుధవారం కూడా సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. సిద్ధమైన నూతన లోగోను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆవిష్కరించనున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన పూర్తి అయింది. 13 చరణాలతో కూడిన పాటలో… రాష్ట్ర గీతంగా 3 చరణాలను 2 నిమిషాల 30 సెకన్లతో రూపొందించారు.