మిషన్‌ భగీరథకు కేంద్రం అవార్డు ఇవ్వడం పట్ల కేటీఆర్ స్పందన

తెలంగాణలోని ప్రతి ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుండి మరోసారి అవార్డు వరించింది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 100% ఇండ్లకు నల్లాల ద్వారా మంచినీరు అందిస్తున్న ఏకైక పెద్ద రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం గుర్తించింది. అక్టోబర్‌ 02 న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు ప్రదానం చేస్తారు. ఈ మేరకు జాతీయ జల్‌ జీవన్‌ మిషన్‌ అడిషనల్‌ సెక్రటరీ, మిషన్‌ డైరెక్టర్‌ వికాస్‌ శీల్‌.. రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు బుధవారం లేఖ రాశారు.

దేశంలోనే అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలకు ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధి చేసిన మంచినీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను ప్రశంసించారు. నల్లా నీటిని అందించడంలో ఆదర్శమైన పనితీరును కనపర్చిందని పేర్కొన్నారు. అవార్డు అందించడం ద్వారా ఇంటింటికి నల్లా నీటిని అందిస్తున్న సిబ్బందికి ప్రోత్సాహకంగా ఉంటుందని తెలిపారు. ఈ అవార్డు రావడం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.

మిషన్ భగీరథకు కేంద్రం అవార్డు ప్రకటించడంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. అన్ని గ్రామీణ ఆవాసాలకు సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. మిషన్ భగీరథకు రూ.19వేల కోట్లు ఇవ్వాలన్న నీతిఆయోగ్ సిఫారసులను ఎన్డీయే ప్రభుత్వం గౌరవిస్తే ఇంకా బాగుంటుందని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.